అర్జీ ఇస్తే.. పరిష్కారమే లక్ష్యం
సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు తరలివచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వారు అర్జీలు సమర్పించారు. అర్జీదారులతో మాట్లాడిన కలెక్టర్ సమస్యల వివరాలను తెలుసుకుని, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.