అమ్మ కాపాడవా అంటూ... ఘనంగా అమ్మవార్ల విగ్రహా నిమజ్జనం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణంలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని అమ్మవారి శాల, శివాలయం అమ్మ భవాని, గరీబ్ నగర్, వెంగల్ రెడ్డి కాలనీ, కిషన్ సింగ్ వీధి ప్రాంతాలలో దసరా నవరాత్రి అమ్మవారిని వివిధ రూపాలలోని విగ్రహాలను ప్రతిష్టించారు. దసరా నవరాత్రుల్లో ప్రతిరోజూ అమ్మవారికి పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాలను భక్తుల కోలాహలం, జైజై నినాదాల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లి పాములపాడు మండలం ఎర్ర గూడూరు గ్రామ సమీప ఎస్ఆర్ఎంసి కాలువలో నిమజ్జనం చేశారు.
దసరా ఉత్సవాలు భక్తులలో భక్తిభావాన్ని, ఐక్యతను చాటిచెప్పాయి. తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన ఉత్సవాలు అమ్మవారి విగ్రహాల నిమజ్జనంతో ముగిశాయి.