ఆంధ్ర ఎన్నికల్లో పాల్గొన వద్దు !!
సాలూరు, సూర్య : నవంబర్ మూడో తేదీన ఏపీ ప్రభుత్వం జరగనున్న స్థానిక ఎన్నికల్లో కొటియా గ్రామాల ప్రజలు పాల్గొనరాదని, అంతేకాకుండా మీరంతా ఒడిశాతోనే ఉండాలని ఆ రాష్ట్ర కొరాపుట్ జిల్లా సబ్ కలెక్టర్ ఫాబ్రీ రషీద్ కోరారు. నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఒడిశా అధికారులు అప్రమత్తమయ్యారు. దశాబ్దాల కాలంగా ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదస్పదంగా ఉన్న 21కొటియా గ్రూపు గ్రామాల్లో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు గురువారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టు చెన్నూరు, కోన దొర, ఎగువ శంభి, ఎగువ, దిగువ గంజాయి భద్ర గ్రామాల తోపాటు ఎగువ కొటియా గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఆయా గ్రామాల గిరిజనులతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక ఎన్నికల్లో పాల్గొనరాదని, త్వరలో ఒడిశా ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక ఎన్నికల్లో చురుకుగా పాల్గోవాలన్నారు. అలాగే ఏ రాష్ట్రం వైపు ఉంటారని అడగ్గా, కొటియా మినహా మెజారిటీ గ్రామాల ప్రజలు ఏపీ వైపు మొగ్గు చూపారు. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల పేరుతో ఏటా వేలాది రూపాయిలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అందుతున్నాయని, ప్రతీ నెల నాలుగు వేల రూపాయిల చొప్పున వృద్దులు, వితంతువులకు పించన్ ఇస్తున్నారని, అందుకే తాము ఏపీ వైపు ఉంటామని చెప్పారు. అంతేకాకుండా తమకు ఆంధ్ర ప్రదేశ్ ఇచ్చిన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయని, అంగన్వాడీలకు ఇచ్చే గౌరవ వేతనంలో సైతం వ్యత్యాసం ఉందని ప్రజలు వివరించారు. అన్నీ విన్న ఒడిశా అధికారులు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కూడా అడిగి తెలుసుకొని, వాటిని వ్రాసుకొని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. ఒడిశా వైపు ఉంటే కొటియా గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.