అధునాతన సాంకేతికతోనే రైతులకు మేలు
బాపట్లలో రూ.5 కోట్లతో కోత అనంతర సాంకేతిక కేంద్రం ప్రారంభం
బాపట్ల, మేజర్ న్యూస్
వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుంటే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్ల చిల్లరగొల్లపాలెంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో రూ.5 కోట్లతో నిర్మించిన కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, పరిశోధన కేంద్రం, వర్క్‌షాప్, శిక్షణ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. పంటలను ప్రాసెసింగ్ చేసి మంచి ధరలకు విక్రయించుకునేలా పరిశోధనలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి మండలానికి మూడు క్లస్టర్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వ్యవసాయ యంత్రాలను రైతులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మ, ఏలూరి సాంబశివరావు, ఎం.ఎం. కొండయ్య తదితరులు పాల్గొన్నారు.