3 గంటలకే సిరిమానోత్సవం.... * సంప్రదాయాలను పాటిస్తూనే త్వరగా పూర్తి చేయాలి *
విజయనగరం, సూర్య : శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కోరారు. మరునాడు మున్సిపల్ ఎన్నికలు ఉండటంతోపాటు, అదేరోజు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎట్టిపరిస్థితిలోనూ సాయంత్రం 5 గంటలు లోపలే ఈ సంబరాన్ని పూర్తి చేసేవిధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సాంప్రదాయాలను పాటిస్తూనే, ఉత్సవాన్ని ముందుగా నిర్వహించాలని సూచించారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహణపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖలు చేస్తున్న ఏర్పాట్లను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మరునాడు మున్సిపల్ ఎన్నికలు, తుఫాను వచ్చే అవకాశం కూడా ఉందని, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సిరిమాను ఉత్సవాన్ని త్వరగా ముగించాలని స్పష్టం చేశారు. విజయనగరం కార్పొరేషన్ ఎన్నికలు 29న జరుగుతాయని, 28న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో, ప్రణాళికాబద్దంగా వ్యవహరించి, ప్రశాంతంగా సిరిమాను ఉత్సవాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. నాణ్యతతో కూడిన ప్రసాదాన్ని సరిపడినంత సిద్దంగా ఉంచాలన్నారు. ఆలయం చుట్టుప్రక్కల ఖాళీ స్థలాన్ని చదునుచేసి, కార్పెట్ వేయాలని అన్నారు. భక్తుల రాకపోకలకు సరిపడేవిధంగా బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, పారిశుధ్యంపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. తెప్పోత్సవానికి అన్నిరకాల భద్రతా చర్యలతో పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అమ్మవారి పండుగ, ఎన్నికలు, కౌంటింగ్‌ను దృష్టిలో ఉంచుకొని నాలుగు రోజులపాటు డ్రైడే పాటించాలని, 27 నుంచి 30వ తేదీ వరకు మద్యం షాపులు, బార్లను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎస్‌పి ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, ఈ ఏడాది సిరిమానోత్సవానికి సుమారు 3.5లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉచిత బస్సుల కారణంగా మహిళా భక్తుల సంఖ్య 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వెలుగు ఉండగానే సిరిమానోత్సవాన్ని ముగించేవిధంగా ఏర్పాట్లు చేయాలని యంత్రాంగాన్ని కోరారు. అలాగే మూడంచెల బారికేడింగ్, బాక్సుల్లో రెండెంచల బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సిరిమాను తిరిగే ప్రధాన రహదారిలోని షాపులను సోమవారం రాత్రి 10 గంటలనుంచే మూసివేయాలని కోరారు. ఘటాలను అమ్మవారి దర్శనం పూర్తి కాగానే, అక్కడినుంచి ఎప్పటికప్పుడు ప్రత్యేక వాహనంలో తరలించే ఏర్పాట్లు చేయాలని ఎస్‌పి సూచించారు. సమావేశంలో డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, ఆర్డిఓ సుధాసాగర్, డిఎస్‌పి లక్ష్మణమూర్తి, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఈఓ శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.