23 నుంచి 'అఖిలభారత డ్వాక్రా బజార్ (సరస్)... *డీఆర్డీఏ పిడి శ్రీనివాస పాణి...
విజయనగరం, సూర్య : అఖిలభారత డ్వాక్రా బజార్ (సరస్) ను ఈ నెల 23 వ తేదీ నుంచి ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస పాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ఆర్ఎల్ఎమ్-సెర్ప్, ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఈ సరస్ ఫెయిర్లో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల నాణ్యమైన ఉత్పత్తులను ఎగ్జిబిట్-కమ్-సేల్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక అంబేద్కర్ జంక్షన్ సమీపంలోని మాన్సాస్ గ్రౌండ్ లో నవంబర్ 2 వరకు జరిగే ఈ ప్రదర్శనలో మొత్తం 254 స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో 77 హ్యాండ్లూమ్ (చేనేత) స్టాల్స్, 105 హ్యాండీక్రాఫ్ట్ (హస్తకళల) స్టాల్స్ మరియు వివిధ రాష్ట్రాల ప్రత్యేక వంటకాలతో కూడిన 72 ఫుడ్ స్టాల్స్ ఉంటాయని ఆయన వివరించారు. ప్రజలందరూ ఈ సరస్ ఫెయిర్ను సందర్శించి, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస పాణి ప్రకటనలో కోరారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.