|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:41 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పటి మావోయిస్టు, హోంగార్డుగా పనిచేసిన మల్లేపాకుల వెంకటయ్య (అలియాస్ మోహన్) గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, గ్రామస్థుల మద్దతుతో ఈ ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమైంది.కొండారెడ్డిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వు కావడంతో, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన వెంకటయ్య బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన తన హోంగార్డు ఉద్యోగానికి రాజీనామా చేసి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో గ్రామస్థులంతా ఏకాభిప్రాయానికి వచ్చి వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలోని 10 వార్డులకు కూడా ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో అవన్నీ కూడా ఏకగ్రీవమయ్యాయి.వెంకటయ్య 1994లో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2000 సంవత్సరం వరకు చురుగ్గా పనిచేశారు. అనంతరం 2001లో పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. 2003 నుంచి కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.