|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 06:42 PM
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో.. పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు హెడ్‌మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. నంగునూరు మండలం పరిధిలోని బద్దిపడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పద్మను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
ఈ సస్పెన్షన్‌కు దారి తీసిన సంఘటన... జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించడంతో జరిగింది. ఆమె నేరుగా పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ (Collector) తనిఖీ చేసే సమయానికి.. నిర్ణీత మెనూ ప్రకారం విద్యార్థులకు వెజిటబుల్ కర్రీ, కిచిడీ, గుడ్డు అందించాలి. కానీ.. వాస్తవంగా వారికి కేవలం అన్నం, సాంబార్ మాత్రమే అందించడం జరిగింది. అంతేకాకుండా.. సాంబార్ తయారీలో కూడా నాణ్యతా లోపం ఉన్నట్లు కలెక్టర్ గుర్తించారు.
సాంబార్‌ను పప్పుతో కాకుండా.. మొక్కజొన్న పిండి , ఇతర నాణ్యత లేని పదార్థాలతో తయారు చేసినట్లు తేలింది. కలెక్టర్ ముందుగానే సాంబారులో నీళ్లు పోయడం గమనించడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిధులను పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగా కలెక్టర్ భావించారు. విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ విషయంపై కలెక్టర్ హైమావతి స్పందించారు. ఆమె వెంటనే జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి.. హెచ్‌ఎం పద్మపై తక్షణం చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
ఉత్తర్వులు జారీ..
కలెక్టర్ ఆదేశాల మేరకు.. డీఈవో శ్రీనివాస్ రెడ్డి వరంగల్ ఆర్జేడీ అనుమతి తీసుకుని.. హెడ్ మాస్టర్ పద్మను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు, హెచ్‌ఎంలకు హెచ్చరికగా పనిచేస్తుందని.. ఇకపై మధ్యాహ్న భోజన పథకం విషయంలో నాణ్యత, పారదర్శకతను పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.