|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 03:22 PM
హైదరాబాద్ శివారులో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారికి హైడ్రా గట్టి షాక్ ఇచ్చింది. రాజేంద్రనగర్ పరిధిలో ఏకంగా రూ.139 కోట్లకు పైగా విలువ చేసే పార్కుల స్థలాలను ఆక్రమణల నుంచి విడిపించింది. ఈ ఉదయం భారీ ఆపరేషన్ చేపట్టి, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది.వివరాల్లోకి వెళితే, రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్-ఉప్పరపల్లి గ్రామాలలో సుమారు 120 ఎకరాల్లో జనచైతన్య లేఅవుట్ ఫేజ్ 1, 2లను హుడా ఆమోదంతో ఏర్పాటు చేశారు. అయితే, ఈ లేఅవుట్‌లో ప్రజల అవసరాల కోసం కేటాయించిన నాలుగు పార్కుల స్థలాలు కొంతకాలంగా కబ్జాకు గురవుతున్నాయి. దాదాపు 19,878 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులను ఆక్రమించుకుని ప్రహరీలు, షెడ్లు, గదులు నిర్మించారు.ఈ విషయంపై స్థానికుల నుంచి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. పార్కుల స్థలాలు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా సిబ్బంది కూల్చివేతల ప్రక్రియ చేపట్టారు. ఆక్రమణదారులు నిర్మించిన ప్రహరీ గోడలు, షెడ్లను పూర్తిగా తొలగించారు.