|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 03:20 PM
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) తన నాయకత్వంలో కీలక మార్పును ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా ఒక భారతీయుడికి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పనిచేస్తున్న తరుణ్ గార్గ్‌ను ఈ ఉన్నత పదవికి నియమించినట్లు బుధవారం వెల్లడించింది.తరుణ్ గార్గ్ నియామకం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత ఎండీ ఉన్సూ కిమ్ 2025 డిసెంబర్ 31న తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఆయన దక్షిణ కొరియాలోని హ్యుందాయ్ మాతృసంస్థలో వ్యూహాత్మక బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటి వరకు తరుణ్ గార్గ్ ‘ఎండీ & సీఈఓ డెసిగ్నేట్’ హోదాలో కొనసాగుతారని కంపెనీ బీఎస్ఈకి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా ఉన్సూ కిమ్ కంపెనీకి అందించిన విలువైన సేవలను డైరెక్టర్ల బోర్డు ప్రశంసించింది.