పూడూరులో ఘనంగా దుర్గామాత నిమజ్జనోత్సవం
మేడ్చల్, మేజర్ న్యూస్: మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలో దుర్గామాత నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి నామస్మరణలు, డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాలతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పురోహితులు వెంకట్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన వేలంపాటలో గ్రామానికి చెందిన తోకల రవి రూ.66 వేలకు అమ్మవారి లడ్డూను దక్కించుకున్నారు. రాజబొల్లారం గ్రామానికి చెందిన కురుకుల మహేష్ రూ.78 వేలకు అమ్మవారికి సమర్పించిన డబ్బుల దండాను కైవసం చేసుకున్నారు. అనంతరం దుర్గామాత నిమజ్జన శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. భవానీమాత మాలాధారులు డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ, అమ్మవారి నామస్మరణలతో ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం గ్రామంలోని ఎర్ర చెరువులో దుర్గామాత విగ్రహాన్ని సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గూడూరు శ్రీధర్ రెడ్డి, కంభం సుమన్, సాయితేజ, బీఆర్ఎస్ నాయకులు బాసుపల్లి రాంరెడ్డి, అకిటి నవీన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కోలా వెంకటేష్, డప్పు కృష్ణ, గ్రామస్తులు తుపాకుల తిరుపతి, తుపాకుల దేవేందర్, తాళ్ల మురళిరెడ్డి, దుండిగాళ్ల శంకర్, జీ. పరమేష్, శేషి కుమార్, మహేందర్, కటకం లక్ష్మణ్, రాజేందర్, విఠల్ తదితరులతో పాటు భవానీమాత మాలాధారులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.