గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు -ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి -జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
జిల్లాలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో లింగ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ వైద్యులు, ఆస్పత్రుల నిర్వాహకులతో సమావేశమై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ల నమోదు, నిర్వహణ, ప్రభుత్వ నిబంధనల అమలుపై సమీక్షించారు. నూతన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న 13 ప్రైవేట్ ఆస్పత్రులు, 6 స్కానింగ్ కేంద్రాల దరఖాస్తులను పరిశీలించి, చర్చించిన అనంతరం అనుమతులు మంజూరు చేశారు.గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, ప్రోత్సహించినా లేదా వాటికి సహకరించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వైద్య సంస్థలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్టులు తల్లి, శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య ప్రమాణాలను పాటిస్తూ సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.అనంతరం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ, జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీల సభ్యులతో సమీక్ష నిర్వహించి, జిల్లాలో అనుమతులతో పనిచేస్తున్న ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల వివరాలను తెలుసుకున్నారు. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారించిన తర్వాతే అనుమతుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ చట్ట నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి నిహారిక, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా ప్రైవేట్ ఆస్పత్రుల అధ్యక్షుడు డాక్టర్ చెన్నయ్య, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవి నాయక్, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్