telangana
ఆయుధ పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి :కామారెడ్డి జిల్లాలో మంగళవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయుధ భాండాగారంలోని ఆయుధాలకు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పోలీసు శాఖలో ఆయుధాలు, వాహనాల ప్రాధాన్యతను గుర్తుచేసుకున్నారు. పోలీసు శాఖ సంప్రదాయాలను పాటిస్తూ విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. పోలీసు విధుల నిర్వహణలో ఆయుధాలు, వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటి సంరక్షణ, నిర్వహణలో సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పండుగ వేళ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో విజయదశమి వేడుకలను జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నర్సింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ పి. విట్టల్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.