సంప్రదాయ దుస్తుల్లో ఆడపడుచుల ఆటపాటలు.. పూల పండుగతో పల్లెల్లో సందడి
కొల్చారం …కొల్చారం మండలవ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఆడపడుచులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బతుకమ్మలకు నైవేద్యాలు సమర్పించి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఆటపాటలతో సందడి చేశారు.మహిళలు, యువతులు బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. జానపద గీతాలు, మహిళల కోలాహలంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు సైతం బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాలతో గడిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. పూల సోయగాలు, మహిళల ఆటపాటలతో గ్రామాలన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి.