పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
సూర్య ప్రతినిధి ఇల్లందు :
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని తహసిల్దార్ కాసిం అన్నారు. మంగళవారం తహసిల్దార్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా పట్టబద్రులు ఓటు నమోదు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోవాలన్నారు. నవంబర్ 4న దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల ఓటు హక్కు ఎంత విలువైన కారణంగా ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మండల పరిధిలోని మామిడి గుండాల గ్రామపంచాయతీలో నవంబర్ 3న ఉదయం 10 గంటలకు గ్రామసభ నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ సభకు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అంకిత్, ఆర్డీవో మధు హాజరవుతారన్నారు. ఈ సభలో గత నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కానీ భూముల కేసులు వివరాలు పరిశీలించడం జరుగుతుందన్నారు. మామిడి గుండాల, బోటి గుంపు, రాజ్య తండా, మేడికుంట, చేపల వారి గుంపు, సువర్ణపురం, ధనియాలపాడు, సేవ్య తండా, బాలాజీ తండా తదితర గ్రామాల రైతులు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ భూముల సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందన్నారు. రైతులు తమ అభిప్రాయాలు, సమస్యలు గ్రామ సభలో వెల్లడించవచ్చు అన్నారు.
సూర్య ప్రతినిధి ఇల్లందు రూరల్ రిపోర్టర్ డానియల్