కొల్లంపల్లిలో 552వ సర్వమత సమ్మేళనం విజయవంతం
*నారాయణపేట, సూర్యన్యూస్:* లౌకిక రాజ్యాన్ని స్థాపించుకున్న భారత దేశంలో కుల, మతాల పేరుతో విభజనకు గురికాకుండా మానవత్వమే అసలు మతంగా అలవాటు చేసుకుని ధర్మ మార్గాన్ని అనుసరించాలని వక్తలు పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కొల్లంపల్లి హజ్రత్ సయ్యద్ షా అహ్మద్ ఖుతాల్ హుస్సేనీ అష్రఫీ జలాలీ దర్గా 552వ వార్షిక ఉర్సు ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సర్వమత సమ్మేళనం నిర్వహించారు. దీనికి వివిధ మతాలకు చెందిన గురువులు, పీఠాధిపతులు, విద్యావంతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై మాట్లాడారు. అన్ని మతాల బోధనల సారాంశం ఒక్కటే అని, మానవత్వం, ప్రేమ, శాంతి, సోదరభావమేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ సమానమేనని, కులమతాలకు అతీతంగా పరస్పర గౌరవంతో జీవించాలని సూచించారు. సూఫీ పీఠాలు ప్రేమ, ఐక్యత, మానవ సేవకు ప్రతీకలని, వాటి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి అంతర్మత సదస్సులు హిందూ, ముస్లింల ఐక్యతతోపాటు అన్ని మతాల మధ్య సౌహార్దాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో విద్య, వైద్యం, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు.
*పైకి వెళ్ళిన తర్వాత జవాబు చెప్పాలి : బిఆర్ఎస్ జిల్లా అద్యక్షులు ఎస్ఆర్ రెడ్డి*
మానవ జీవితం కేవలం ఒక వాహనంలో ప్రయాణమని, భూమి మీద చేసిన తప్పు, ఒప్పుల లెక్కను తప్పకుండా పైకి వెళ్ళిన తర్వాత అప్పచెప్పాలని బిఆర్ఎస్ జిల్లా అద్యక్షులు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అన్నారు. మానవత్వంమే నిజమైన మతమని, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం సృష్టిస్తున్న మతం, కులం ఉచ్చులో పడొద్దన్నారు. అన్ని మతాల వారు సమానమని భావించాలని, విభజన కావద్దన్నారు. ఇప్పటివరకు ఎంతమైంది ప్రయత్నం చేసిన ఆది జరగటం లేదన్నారు.
*అన్ని మతాల సారం ఒక్కటే : మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి*
అన్ని మతాల సారం ఒకటేనని, ప్రతి ఒక్కరికి వారి మత గ్రంథాలు అవసరమైన జ్ఞానాన్ని నేర్పిస్తాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. తనకు అన్ని తెలుసు అన్నవాడు మూర్ఖుడు అవుతాడని, మానవత్వంతో నడుచుకుంటే ధర్మాన్ని కాపాడుతుందన్నారు. ఎవరికి అపకారం చేయరాదని అన్ని మతాల్లో వారి వారి ప్రార్థన స్థలాల్లో రాసి ఉంటుందన్నారు.
మనం చేసే మంచి పనుల్లోనే దైవం ఉంటుందన్నారు. అందరితో కలిసి ఉంటే జన్మ సార్థకం అవుతుందని చెప్పారు.
*హాజరైన వివిధ మత పెద్దలు*
కొల్లంపల్లిలో జరిగిన 552వ ఉర్సు ఉత్సవాలలో వివిధ మతాల పెద్దలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అష్రఫియా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో
గోగి షరీఫ్ దర్గా సజ్జాదా నషీన్ సయ్యద్ షా కలీముల్లా హుస్సేనీ అధ్యక్షత వహించగా కొల్లంపల్లి దర్గా సజ్జాదా నషీన్ మఖ్దూం ఖ్వాజా సయ్యద్ షా జలాల్ హుస్సేనీ అష్రఫీ జలాలీ పర్యవేక్షణలో సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా మౌలానా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు వకార్ ఇన్షా, ముజఫర్ హుస్సేన్ ఖాన్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్. రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.ఏ. రషీద్, బీసీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఖలీల్, బీఆర్ఎస్ నాయకుడు సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక గురువులు, సామాజిక, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం అష్రఫియా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. దారుల్ ఉలూమ్ అష్రఫియా మదర్సా విద్యార్థులు ప్రదర్శించిన విద్యా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అతిథులను దర్గా సజ్జాదా నషీన్ మౌలానా మఖ్దూం ఖ్వాజా సయ్యద్ షా జలాల్ హుస్సేనీ అష్రఫీ జలాలీ, డాక్టర్ మౌలానా సయ్యద్ అహ్మద్ హుస్సేనీ అష్రఫీ జలాలీ సత్కరించారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.