telanagana
ఖిల్లా రామాలయానికి రోప్ వే మంజూరు...
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :ఎంతో ఘన చరిత్ర కలిగిన ఇందూరు ఖిల్లా రామాలయానికి రోప్ వే మంజూరైనట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు నిర్మించిన చారిత్రాత్మక కట్టడం ఖిల్లా రామాలయం అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దాశరథి కృష్ణమాచార్యులు జైలు శిక్షణ అనుభవిస్తూ "తెలంగాణ నాకోటి రతనాల వీణ " అని రాసిన గొప్ప చరిత్ర కలిగిన ఖిల్లా రామాలయానికి రోప్ వే మంజూరు కావడం సంతోషకరమన్నారు. పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. సుమారు రూ.35 కోట్ల నిధులతో రోప్ వే నిర్మాణం కానుందని, ఇందుకోసం డీపీఆర్ సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో పాలించిన పాలకులు రామాలయ అభివృద్ధిని మరిచారన్నారు. మోదీ ప్రభుత్వం చారిత్రక కట్టడాలపై ప్రత్యేక దృష్టి వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే పర్వతమాల పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి ఖిల్లా రామాలయ అభివృద్ధి కొరకు గతంలో కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దీంతో రోప్ వే మంజూరైనట్లు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి నితిన్ ఘట్కరితోపాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఖిల్లా రామాలయ అభివృద్ధి పై అనేక సార్లు లేఖలు అందజేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రోడ్లు భవనాల శాఖ అధికారులను, రోప్ వే కంపెనీ ప్రతినిధులను పంపడం సంతోషకరమన్నారు.
అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులపై కూడా అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒక్కటి కూడా రాని నియోజకవర్గం ఇందూరు ఒకటేనని చెప్పారు. సమస్యను మంత్రి పొంగిలేటి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. దీంతో ఇటీవల అర్బన్ లోని సౌత్ మండల అర్హులకు ఇళ్లను కేటాయించాలని గుర్తు చేశారు. అలాగే స్థలం లేని వారికి హైదరాబాద్ మాదిరిగా టవర్లు నిర్మించి ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. ప్రధానంగా స్పెషల్ ఫండ్ కోసం ప్రభుత్వానికి అనేకసార్లు లీగల్ రాసిన స్పందించడం లేదన్నారు. చివరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందన్నారు. స్పెషల్ ఫండ్ కేటాయిస్తే నియోజకవర్గ అభివృద్ధి సులువుగా అవుతుందని తెలిపారు. ఇందూరులో కాషాయ జెండా గెలుపును ఓర్చుకోలేక నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. అవసరపు మాటలు మాట్లాడటమే తప్ప అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ఆలోచించడం లేదన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, మఠం పవన్, రాము, విజయ మల్లేష్ యాదవ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి మురళి, సుమిత్ర కిషోర్, బంటు ప్రీతి ప్రవీణ్, మహిళా మోర్చ అధ్యక్షురాలు వనిత, యువ మోర్చ అధ్యక్షుడు వంశీ, యువ మోర్చ రాష్ట్ర సహా కోశాధికారి విజయ్, ఎస్సీ మోర్చ పురుషోత్తం, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.