సింగిల్ పీస్ డెంటల్ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేసిన నిపుణులు
పలు శస్త్రచికిత్సల శ్రమకు చెక్
హైదరాబాద్: దంత వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (DST) పరిధిలోని 'ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్' (ARCI) శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. దంత అమరిక ప్రక్రియలో రోగులకు ఎదురయ్యే శస్త్రచికిత్సల భారాన్ని తగ్గించేందుకు టైటానియం మిశ్రమలోహం (Ti6Al4V) మరియు జిర్కోనియా (YSZ)లను ఏకీకృతం చేస్తూ ఒకే ముక్కతో కూడిన (సింగిల్ పీస్) రెండు పొరల డెంటల్ ఇంప్లాంట్‌ను రూపొందించారు.
సాంప్రదాయకంగా ఉపయోగించే బహుళ-భాగాల ఇంప్లాంట్లు దవడ ఎముకలో సరిగ్గా స్థిరపడటానికి, అనుసంధానానికి రెండు లేదా మూడు శస్త్రచికిత్సలు అవసరమయ్యేవి. అయితే ARCI శాస్త్రవేత్తలు స్పార్క్ ప్లాస్మా సింటరింగ్ (SPS) అనే అధునాతన సాంకేతికత ద్వారా దవడ ఎముకకు బలాన్నిచ్చేలా టైటానియం, పైభాగాన అందం, అరుగుదల నిరోధకత కోసం జిర్కోనియాలను ఒకే నిర్మాణంగా మార్చారు. లాబొరేటరీ పరీక్షల్లో ఈ నూతన ఇంప్లాంట్ అధిక కాఠిన్యం, జీవ అనుకూలత (బయోకంపాటిబిలిటీ) మరియు బలమైన యాంత్రిక సమర్థతను కనబరిచింది. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో, ఒక్క శస్త్రచికిత్సతోనే సురక్షితమైన దంత అమరిక సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.