జాతీయ ఐక్యతను బలోపేతం చేయడంలో సైనిక్ పాఠశాలల కీలక పాత్ర
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
ఇంఫాల్:సాంకేతిక మార్పులకు అనుగుణంగా మారుతూనే క్రమశిక్షణ, ధైర్యం, దేశభక్తి, నిజాయితీలను యువత తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం మణిపూర్ పర్యటనలో భాగంగా ఆయన మోయిరాంగ్‌లోని ఐఎన్ఏ (INA) మ్యూజియంను, ఇంఫాల్‌లోని సైనిక్ పాఠశాలను సందర్శించారు. మోయిరాంగ్‌లో భారత జాతీయ సైన్యం చారిత్రాత్మక స్వాతంత్ర్య పోరాటాన్ని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగాలను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించారు. అనంతరం సైనిక్ పాఠశాలలోని యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంలో సైనిక్ పాఠశాలల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి నూతన రంగాలలో యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. వికసిత భారత్ సాకారానికి ప్రతి పౌరుడు తమ రోజువారీ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ముఖ్యమంత్రి వై. ఖేమ్‌చంద్ సింగ్‌తో పాటు పలువురు సైనిక, పౌర అధికారులు పాల్గొన్నారు.