telanagana
నకిలీ ఉద్యోగ నియామక మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
శాతవాహన యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసి సుమారు రూ.44 లక్షలు వసూలు చేసిన కేసులో ప్రధాన నిందితుడు దుడపాక తిరుపతి అలియాస్ తిరుపతిరావును కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యానగర్‌కు చెందిన పురుషోత్తం మమత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు తనను యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసి నకిలీ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తించారు. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు సుమారు 21 మంది నుంచి రూ.44 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నకిలీ పరీక్షలు, ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, సర్వీస్ రిజిస్టర్లు, నియామక ఉత్తర్వులు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి కీలకమైన నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలమ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కరీంనగర్-II టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. సృజన్‌రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాష్, సిబ్బంది సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసులో నరసింహమూర్తి, కోలా వెంకటేశ్వర్‌రావు, దుడపాక లావణ్య, ఈట్ల సత్యం, రాజశేఖర్, అంజయ్య, బొల్లా నాగరాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, నియామక ఉత్తర్వులను సంబంధిత అధికారిక సంస్థల ద్వారా ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.