పెరుగుతున్న చమురు ధరలు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: నిరంతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా ప్రధాన ఈక్విటీ సూచీలు క్షీణించి, జూన్ మధ్యకాలం తర్వాత అత్యల్ప స్థాయిలకు పడిపోయాయి. పెట్టుబడిదారులు అప్రమత్తత పాటించడంతో 30 షేర్ల సెన్సెక్స్ 555.23 పాయింట్లు (0.73 శాతం) నష్టపోయి 75,577.58 వద్ద ముగిసింది. అలాగే విస్తృత నిఫ్టీ 144.05 పాయింట్లు (0.61 శాతం) క్షీణించి 23,635.10 వద్ద స్థిరపడింది.
ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి చెందిన స్టాక్‌లు తీవ్ర నష్టాలను నమోదు చేసి మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. ఎస్‌బిఐ లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోగా, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు పడిపోయాయి. అయితే, నిఫ్టీ ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు లాభాల్లో పయనించి మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చాయి. మరోవైపు సూచీల పతనం మధ్య కూడా మిడ్‌క్యాప్ 0.21 శాతం, స్మాల్‌క్యాప్ 0.17 శాతం మేర స్వల్ప లాభాలను సాధించాయి.
ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల దృష్ట్యా సమీప భవిష్యత్తులో మార్కెట్లలో అస్థిరత కొనసాగవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. హెల్త్‌కేర్, టెలికాం, ఐటీ వంటి రక్షణాత్మక రంగాలపై దృష్టి పెట్టడం, స్వల్పకాలిక పెట్టుబడిదారులు పాక్షిక లాభాలను స్వీకరించడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.