telanagana
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.
సూర్య నిజామాబాద్ అర్బన్ : నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గుప్తా డిమాండ్ చేశారు. ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులకు స్టేట్ హెల్త్ సొసైటీ (ఎస్హెచ్ఎస్) ద్వారా స్పర్శ్ విధానంలో వేతనాలు చెల్లించాలని, 2022 నుంచి పెండింగ్లో ఉన్న ఐదు శాతం ఇంక్రిమెంట్తో పాటు ఎనిమిది శాతం వార్షిక వేతన పెంపును అమలు చేయాలని కోరారు. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా సెలవుల సదుపాయాలు కల్పించాలని, ఉద్యోగులకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈహెచ్ఎస్, ఈఎస్ఐ వైద్య సదుపాయాలు కల్పించాలని, గర్భిణీ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు సహా అర్హులైన సిబ్బందికి తగిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ, ఏరియర్స్ బకాయిలను చెల్లించడంతో పాటు జీవో నంబర్ 60, 1195 ప్రకారం అర్హులైన ఉద్యోగులకు వేతన సవరణ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని, వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గణేష్ బిగాల పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.