దసరాలోపు సొంతింటిపై స్పష్టత ఇవ్వాలి
స్పందించకుంటే మలిదశ పోరాటానికి సిద్ధం
సీఐటీయూ
సూర్య, మందమర్రి:సింగరేణి కార్మికుల సొంతింటి కలను దసరాలోపు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు తీసుకురావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాని పక్షంలో దసరా అనంతరం అన్ని ఏరియాల్లో కార్మికులను భాగస్వామ్యం చేస్తూ మలిదశ పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సొంతింటి అంశంపై కార్మికులను చైతన్యపరచడంలో సీఐటీయూ గత కొన్నేళ్లుగా నిరంతరం కృషి చేసిందని తెలిపారు. గోదావరిఖనిలో నిర్వహించిన ఆమరణ నిరాహార దీక్షకు వచ్చిన స్పందనతో పాటు సింగరేణి ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ సొంతింటి హామీ ప్రస్తావనకు వచ్చేలా తమ పోరాటం ప్రభావం చూపిందన్నారు. అయితే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు వాటి అమలుపై స్పష్టత లేకపోవడం కార్మికులను నిరాశకు గురిచేస్తోందన్నారు. సొంతింటి అంశంపై వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన హామీలు, వినతిపత్రాలు, ప్రకటనలపై కార్మికులు గమనించాలని సూచించారు. సింగరేణిపై ప్రభుత్వం పలుమార్లు సమీక్షలు నిర్వహించినప్పటికీ సొంతింటి కలపై తుది నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దసరాలోపు ప్రభుత్వం సొంతింటి హామీ అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో దసరా అనంతరం అన్ని ఏరియాల్లో కార్మికులను సమీకరించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అల్లి రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సివిల్ పిట్ కమిటీ సభ్యులు సత్తయ్య, బోనాల మహేందర్, ఆగిడి రాజ్‌కుమార్, బి.కుమారస్వామి, శంకర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.