డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపికలో పారదర్శకత ఏది,అసంపూర్తి ఇళ్లను హడావుడిగా కేటాయించడం సరికాదు — కౌన్సిలర్ తిమ్మాజిపేట్ పాండు
నాగర్ కర్నూల్ పట్టణంలోని డబల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని నాగర్‌కర్నూల్ మున్సిపల్ కౌన్సిలర్ తిమ్మాజిపేట పాండు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నాగర్‌కర్నూల్ పట్టణంలో సుమారు 90 శాతం పనులు పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మిగిలిన పనులు పూర్తి చేయకుండా దాదాపు మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంచారని ఆయన అన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇప్పుడు హడావుడిగా 192 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.ఇళ్ల పరిస్థితి చూస్తేనే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థమవుతుందని అన్నారు.అసంపూర్తి ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని, లబ్ధిదారులే మిగిలిపోయిన పనులు చేసుకుంటే ప్రభుత్వం ఎందుకు,అధికారులు ఎందుకని ప్రశ్నించారు.192 మంది లబ్ధిదారులను ఏ విధానం ప్రకారం ఎంపిక చేశారు? ఎవరు దరఖాస్తులను పరిశీలించారు? ఏ ప్రమాణాల ఆధారంగా అర్హత నిర్ణయించారు? అనే విషయాలను ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన వివరాలు స్థానిక కౌన్సిలర్లకు, దరఖాస్తు చేసుకున్న ప్రజలకు కూడా పూర్తిగా తెలియకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, నాయకులు లబ్ధిదారుల నుంచి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారనే ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.అధికార పార్టీకి చెందిన నాయకులకు వేదికపై మాట్లాడే అవకాశం కల్పిస్తూ, ప్రజల తరఫున సమస్యలను ప్రశ్నించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకపోవడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలపై కూడా అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు జేపీ చారి, కొత్త గంగాధర్, పాల్గొన్నారు..
పి వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్