బికారి తండ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా 'పోషణ మాసం' వేడుకలు
బికారి తండ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా 'పోషణ మాసం' వేడుకలు
* గ్రామ సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు
* గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి: అంగన్‌వాడీ టీచర్ బి. కవిత
* ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలి: ఏఎన్ఎం ఉపేంద్రమ్మ, కార్యదర్శి ఇంతియాజ్
కూసుమంచి మండల పరిధిలోని బికారి తండ అంగన్‌వాడీ కేంద్రంలో 'పోషణ మాసం' కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మాధవి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంతియాజ్, గ్రామ పెద్ద బానోతు వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించారు. గ్రామ పెద్ద బానోతు వెంకన్న-ధనమ్మ దంపతులు గర్భిణీ స్త్రీలకు చీర, పూలు, పండ్లు, పసుపు-కుంకుమలతో ఓడి నింపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాధవి మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు.
అనంతరం అంగన్‌వాడీ టీచర్ బి. కవిత మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం పట్ల మరియు వారు తీసుకోవాల్సిన పోషకాహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను, పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు.
మండల ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం ఉపేంద్రమ్మ, పంచాయతీ కార్యదర్శి ఇంతియాజ్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ (ప్రసవాలు) అయ్యేలా చూసుకోవాలని, తద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు నీలమ్మ, భద్రమ్మ, స్థానిక స్కూల్ టీచర్, ఆశా వర్కర్లు సోనీ, నీల, పెద్ద సంఖ్యలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సూర్య కూసుమంచి న్యూస్ /పాలేరు ఇంచార్జ్ ఇరుగు శ్రీను