బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక
సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ;తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 2, 12, 21, 38వ వార్డులలో మహిళలు బతుకమ్మ పండుగను ఉల్లాసంగా జరుపుకొనేందుకు నిర్మించిన నూతన ఘాట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో మహిళలంతా కలసిమెలసి జరుపుకొనే ఈ వేడుక తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతుందని తెలిపారు.ప్రజలు, ముఖ్యంగా ఆడపడుచులు పండుగను భక్తిశ్రద్ధలతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేలా వార్డు కౌన్సిలర్ల ప్రతిపాదనల మేరకు పాలకవర్గ ఆమోదంతో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు 32 లక్షల రూపాయలతో ఈ నాలుగు ఘాట్లను నిర్మించినట్లు వెల్లడించారు. వీటితోపాటు నిమజ్జన ఏర్పాట్ల కోసం పురపాలక సంఘం ద్వారా దాదాపు 29 లక్షల 50 వేల రూపాయలతో బారికేడ్ల ఏర్పాటు, విద్యుద్దీపాలంకరణ, పరిసరాల పరిశుభ్రత వంటి పనులు చేపట్టి ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దామని వివరించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మహిళలకు అనువైన వాతావరణాన్ని సమకూర్చడమే లక్ష్యమని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఘాట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ఉపాధ్యక్షుడు దార్ల సందీప్, విప్ బుర్ర మల్లికార్జున్, కౌన్సిల్ సభ్యులు వేముల రాములు, మొగిలి నాగరాజు, ఎలుక వెంకటేశం, రిక్కమల్లె రజిత సంపత్, బూర బాలు, దార్నం అరుణ లక్ష్మీనారాయణ, లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ, దొంతునేని కళ్యాణి అశోక్ రావు, మామిడాల మహేష్, బుర్ర నారాయణ గౌడ్, కూర భాగ్యలక్ష్మి దేవరాజ్, గుడ్ల శ్రీనివాస్, గుండ్లపళ్లి నీరజ పూర్ణచందర్, బింగి రామాంజనేయులు, నెల్లుట్ల నరేష్, అడిచెర్ల రూప సాయి కృష్ణ, గెంట్యాల శ్యామల శ్రీనివాస్, మంచే రేణుక శ్రీనివాస్, కొండ వర్షిని నరేష్, బత్తుల రమేష్, ఊరకొండ లక్ష్మీ రాజు, కోఆప్షన్ సభ్యులు, పురపాలక అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.