telanagana
అర్జునులొద్ది గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
అర్జునులొద్ది గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి- స్థానిక విశ్వాసాలతో ముడిపడిన గుహలకు గుర్తింపు కల్పించాలని ప్రజల విజ్ఞప్తి
02 సూర్య తిర్యాణి , తిర్యాణి మండలం మెస్రం గూడ గ్రామపంచాయతీ సమీపంలోని అర్జునులొద్ది గుహలను ప్రభుత్వం గుర్తించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ గుహలకు మహాభారత కాలంతో సంబంధం ఉందని, వనవాస సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చారని తరతరాలుగా నమ్ముతున్నట్లు వారు చెబుతున్నారు.గుహల్లో ఆవు పొదుగు ఆకారాన్ని పోలిన శిలలు ఉన్నాయని స్థానికులు వివరిస్తున్నారు. వాటిని తాకి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రజల్లో విశ్వాసం ఉందని అంటున్నారు. అర్జునులొద్ది గుహల నుంచి దండేపల్లి మండలంలోని చిన్నయ్య–పెద్దయ్య దేవుడి ఆలయం వరకు సొరంగ మార్గం ఉందనే కథనం కూడా స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ కథనాలకు సంబంధించిన చారిత్రక ఆధారాలను అధికారులు పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.ప్రత్యేకత ఉన్న ఈ గుహల గురించి ఇతర ప్రాంతాల వారికి పెద్దగా తెలియడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు గుహలను సందర్శించి, వాటి స్థితిగతులు, భద్రత, అక్కడికి వెళ్లే మార్గాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైన సౌకర్యాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.స్థానికుల విశ్వాసాలు, మౌఖిక చరిత్రను నమోదు చేయడంతో పాటు గుహల ప్రత్యేకతపై అధ్యయనం చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.