telanagana
అంగరంగ వైభవంగా అమ్మవారి పల్లకీ సేవ....పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
సూర్య కరీంనగర్ ప్రతినిధి ;దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో 6వ రోజైన శుక్రవారం రోజు మూలా నక్షత్రం సరస్వతి దేవీ (కాత్యాయనీ) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు శ్రీ మహాశక్తి ఆలయానికి క్యూ కట్టారు. భవానీ భక్తులు ఒకవైపు, విద్యార్థుల అక్షరాభ్యాసం, పుస్తకాల పూజ మరోవైపు... వెరసి మహాశక్తి ఆలయం జ్ఝాన సరస్వతి నిలయంగా మారిపోయింది. చదువుల తల్లి జ్ఝాన సరస్వతి దివ్య దర్శనంతో భక్తుల మనుసులు పులకించిపోయాయి. భవానీ దీక్షలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చదువుల తల్లి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లారావు యాదవ్ తోపాటు పలువురు ప్రముఖులు బండి సంజయ్ తోపాటు మహాశక్తి అలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
అంగరంగ వైభవంగా అమ్మవారి పల్లకీ సేవ
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాశక్తి ఆలయంలో సాయంత్రం అమ్మవారి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా కొనసాగింది. అధ్యాత్మిక ప్రవచనాలు ఒకవైపు... సరస్వతి దేవీని కీర్తిస్తూ చిన్నారులు, మహిళలు న్రుత్యాలు మరోవైపు వెరసి భక్తులను కనువిందు చేశాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆద్యంతం పల్లకీ సేవలో తరించారు.