నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిరియా రీసెర్చ్ స్వర్ణోత్సవాలు ప్రారంభం
సూర్య జాతీయ డెస్క్: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిరియా రీసెర్చ్ సంస్థ చేపట్టిన దశాబ్దాల సేవలను గుర్తించేలా నిర్వహించ తలపెట్టిన ఏడాది పాటు సాగే స్వర్ణోత్సవ వేడుకలు న్యూఢిల్లీలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలో మలేరియా నియంత్రణకు సంబంధించి గత ఐదు దశాబ్దాలుగా ఈ సంస్థ సాధించిన పురోగతిని, శాస్త్రవేత్తల కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. దేశ స్వాతంత్ర్య సమయంలో అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా ఉన్న మలేరియాను కట్టడి చేయడంలో ఈ పరిశోధనా సంస్థ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.
ఆధునిక వైద్య సేవలు, నూతన రోగ నిర్ధారణ పద్ధతులు, నాణ్యమైన మందులు, దోమల నిర్మూలన కార్యక్రమాలు అలాగే ప్రజల భాగస్వామ్యం కారణంగానే మలేరియా నియంత్రణ సాధ్యమైందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. మలేరియా నివారణ దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతిని అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే 2024 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన అత్యధిక భారంతో కూడిన దేశాల జాబితా నుంచి భారత్ బయటపడిందని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలు మరియు సామాన్య ప్రజల సమిష్టి కృషితోనే ఈ మైలురాయిని చేరుకోగలిగామని తెలిపారు.
మలేరియా పరాన్నజీవులు, దోమల జీవన చక్రం, వెక్టర్ నియంత్రణ, క్రిమిసంహారక మందులను తట్టుకునే శక్తి వంటి అంశాలపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిరియా రీసెర్చ్ గత యాభై ఏళ్లుగా ఎన్నో కీలక పరిశోధనలు చేసిందని రాష్ట్రపతి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు, అనియంత్రిత పట్టణీకరణ మరియు దోమలలో పెరుగుతున్న నిరోధక శక్తి వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పరిశోధనలను మరింత ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం వైద్య చికిత్సల ద్వారానే కాకుండా పరిసరాల శుభ్రత, నీరు నిల్వ ఉండకుండా చూసే పద్ధతులు, పర్యావరణ నిర్వహణ కూడా వ్యాధి నివారణలో అత్యంత కీలకమని ఆమె ఉద్ఘాటించారు.
ఇదే వేదికపై డెంగ్యూ వంటి ఇతర ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ మరియు మారుతున్న రుతుపవనాల సరళి కారణంగా భవిష్యత్తులో డెంగ్యూ వంటి వ్యాధులు మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షయ, లెప్రసీ మరియు కాలా-అజార్ వంటి వివిధ వ్యాధుల కట్టడిలో ఐసీఎంఆర్ అందించిన పరిశోధనా సేవలు దేశ ఆరోగ్య విధానాలను రూపొందించడంలో ఎంతగానో దోహదపడ్డాయని ప్రశంసించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల నెట్వర్క్ను ఏర్పాటు చేయడంతో పాటు స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో ఐసీఎంఆర్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.
భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అనుగుణంగా ఆరోగ్య రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. పరిశోధనా సంస్థలు, ఉన్నత విద్యా కేంద్రాలు మరియు పారిశ్రామిక రంగాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడంలో ఐసీఎంఆర్ మరియు దాని అనుబంధ సంస్థలు తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తాయనే పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ స్వర్ణోత్సవ వేడుకలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.