బెదిరింపులకు లొంగేది లేదు..దేశ భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తే ముఖ్యం
సూర్య జాతీయ డెస్క్: భారత్ ఎల్లప్పుడూ శాంతిని కాంక్షిస్తుందని, ఏ దేశ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని అనుకోవడం లేదని.. అయితే శాంతిని బలహీనతగా భావిస్తే సహించేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ‘డిఫెన్స్ కాన్క్లేవ్’లో ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి ముప్పు వాటిల్లినప్పుడు భారత్ గట్టిగా తిప్పికొడుతుందని హెచ్చరించారు. ప్రపంచ స్థిరత్వాన్ని భారత్ కోరుకుంటుందని, అయితే అది తమ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని ఆయన స్పష్టం చేశారు. దేశ భద్రత అనేది కేవలం సాయుధ బలగాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సమష్టి బాధ్యత అని పునరుద్ఘాటించారు.
ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలతో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని రక్షణ మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని రాజ్య విధానంగా, ఆయుధంగా వాడుకునే దేశాలకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. పొరుగు దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నంత కాలం, తమ రక్షణ కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకునే పూర్తి హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. పౌరులు మతం, కులం, ప్రాంతం, భాష వంటి విబేధాలను విడిచిపెట్టి జాతీయ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. భారత్ ఒక నాగరిక శక్తి అని, వివాదాల ద్వారా కాకుండా అందరినీ కలుపుకునిపోయే అభివృద్ధి ప్రాతిపదికన ముందుకు సాగుతోందని చెప్పారు.
స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్ చారిత్రాత్మక పురోగతి సాధించిందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భారతదేశ రక్షణ ఎగుమతులు 2013-14లో రూ. 686 కోట్లుగా ఉండగా, 2025-26 నాటికి అవి రికార్డు స్థాయిలో రూ. 38,424 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం 100కు పైగా దేశాలకు భారతీయ రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, 2029 నాటికి రూ. 50,000 కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. అలాగే రక్షణ బడ్జెట్ కేటాయింపులు 2013-14లో రూ. 2.53 లక్షల కోట్లు ఉంటే, 2026-27 నాటికి రూ. 7.85 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. ఇందులో మూలధన కొనుగోళ్ల బడ్జెట్‌లో 75 శాతాన్ని (రూ. 1.39 లక్షల కోట్లు) స్వదేశీ పరిశ్రమల నుంచే కొనుగోలు చేయడానికి కేటాయించామని తెలిపారు.
యుద్ధ తంత్రాల తీరుతెన్నులు వేగంగా మారుతున్నాయని, సంప్రదాయ యుద్ధాలతో పాటు సైబర్, స్పేస్, ఎలక్ట్రానిక్ మరియు సమాచార రంగాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, క్వాంటమ్ టెక్నాలజీ వంటి వినూత్న సాంకేతికతలలో స్వయంప్రతిపత్తి సాధించడం అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రైవేట్ రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు డిఆర్‌డిఒ అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను అర్హత కలిగిన భారతీయ పరిశ్రమలకు బదిలీ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయంగానే ఆయుధ వ్యవస్థలను రూపొందిస్తూ స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని ముగించారు.