ఉద్యోగుల డేటా చోరీ చేసినట్లు "షైనీహంటర్స్" హ్యాకర్ల సంచలన ప్రకటన
సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికా అంతర్గత భద్రతా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) నెట్‌వర్క్‌లోకి చొరబడి ఐదు వేల మందికి పైగా అధికారులు మరియు ఉద్యోగుల వ్యక్తిగత డేటాను చోరీ చేసినట్లు కుప్రసిద్ధ సైబర్ నేరస్థుల ముఠా "షైనీహంటర్స్" ప్రకటించింది. ఈ దాడితో ఎఫ్‌బీఐ నియామకాలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ మరియు స్పెషల్ ఏజెంట్ అప్లికెంట్ పోర్టల్ తాత్కాలికంగా పనిచేయకుండా పోయాయి. సైబర్ దాడి బాధితులు పరిహారం చెల్లించవద్దని గత మే నెలలో ఎఫ్‌బీఐ జారీ చేసిన హెచ్చరికలకు ప్రతికారంగానే ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు హ్యాకర్లు డార్క్ వెబ్ ద్వారా వెల్లడించారు.
చోరీ చేసిన సమాచారంలో ఎఫ్‌బీఐ ఏజెంట్ల పేర్లు, వారి ఇంటి చిరునామాలు, సోషల్ సెక్యూరిటీ నంబర్లు, విధి నిర్వహణ వివరాలతో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉన్నాయని హ్యాకర్లు తెలిపారు. ఇందుకు ఆధారంగా హ్యాక్ చేసిన ఎఫ్‌బీఐ రిక్రూట్‌మెంట్ పోర్టల్ స్క్రీన్ షాట్‌లు, నమూనా డేటాను వారు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. విడుదల చేసిన ఈ డేటాను ప్రముఖ వార్తా సంస్థలు, క్రెడిట్ బ్యూరో రికార్డులతో సరిపోల్చి చూడగా అందులో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వివరాలతో సహా పలువురి డేటా సరిపోలినట్లు నిర్ధారణ అయింది.
ఈ సైబర్ చొరబాటు వార్తలపై ఎఫ్‌బీఐ స్పందిస్తూ నియామక పోర్టల్‌లో జరిగిన అనధికారిక కార్యకలాపాలపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని ధ్రువీకరించింది. అయితే అంతర్గత ప్రధాన సిస్టమ్‌ల నుంచి డేటా చోరీకి గురైందా లేదా థర్డ్ పార్టీ వెబ్‌సైట్ ద్వారా డేటా లీక్ అయిందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రక్షణ మరియు నిఘా ఏజెన్సీ అధికారుల వ్యక్తిగత వివరాలు నేరస్థుల చేతుల్లోకి వెళ్లడం వల్ల దర్యాప్తు అధికారుల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ దోపిడీలకు పాల్పడే ఈ షైనీహంటర్స్ ముఠా గతంలో ప్రముఖ గేమింగ్ సంస్థలు, విద్యా సంస్థల డేటాను కూడా హ్యాక్ చేసి సంచలనం సృష్టించింది. ఒకసారి నిఘా అధికారుల సమాచారం బహిర్గతమైతే దానిని నేరస్థులు సుదీర్ఘకాలం బెదిరింపులకు ఉపయోగిస్తారని పూర్వ ఎఫ్‌బీఐ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా సైబర్ సెక్యూరిటీ దళాలు ఎఫ్‌బీఐ డిజిటల్ మౌలిక వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, సమాచార భద్రతను పునరుద్ధరించే చర్యలు చేపట్టాయి.