పర్షియన్ గల్ఫ్‌లో ఏడు నౌకలపై దాడులు, అమెరికాకు ఇరాన్ ఐఆర్‌జీసీ హెచ్చరిక
సూర్య అంతర్జాతీయ డెస్క్: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు అమ్ముకుంటున్నాయి. పర్షియన్ గల్ఫ్ ఉత్తర ప్రాంతంలో జరిగిన వరుస ఘటనల్లో ఏడు నౌకలు దెబ్బతినడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నేవీ వెల్లడించిన వివరాల ప్రకారం, చట్టవిరుద్ధంగా చమురు రవాణాలో నిమగ్నమైన నాలుగు నౌకలపై ఏకకాలంలో దాడులు జరగడంతో అవి అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఈ పరిణామం మధ్యప్రాచ్య జలాల్లో ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చింది.
ఇరాన్ సైనిక బలగాలు జరిపిన నిఘా ఆధారంగా ఈ నౌకలను గుర్తించి దాడులు నిర్వహించినట్లు ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో మరో మూడు నౌకలు సముద్రపు మైనాలతో ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ నేవీ, అమెరికా సైన్యం తన దురాక్రమణ చర్యలను కొనసాగిస్తే ప్రాంతీయంగా ఉన్న దాని సైనిక స్థావరాలపై మరింత తీవ్రమైన స్పందన ఉంటుందని హెచ్చరించింది.
ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు రవాణా మార్గాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోర్ముజ్ జలసంధి గుండా సాగే నౌకా ప్రయాణాలపై ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా వైఖరి వల్లే ఈ ప్రాంతంలో అస్థిరత కొనసాగుతోందని ఇరాన్ వర్గాలు ఆరోపిస్తుండగా, వాషింగ్టన్ మాత్రం సముద్ర మార్గాల భద్రతకే తమ ప్రాధాన్యమని స్పష్టం చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ పరిసర ప్రాంతాల్లో యుద్ధ నౌకల సంచారం విపరీతంగా పెరిగింది. చిన్న పొరపాటు జరిగినా అది భారీ ప్రాంతీయ సంఘర్షణకు దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దెబ్బతిన్న నౌకల పరిస్థితి మరియు ఆ ప్రాంతంలో నెలకొన్న సున్నితమైన వాతావరణంపై ఇరు దేశాల ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.