భారత్‌కు హైస్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చేందుకు సిద్ధం! ఎలాన్ మస్క్
సూర్య టెక్నాలజీ & కార్పొరేట్ డెస్క్: భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రవేశంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ఎలాన్ మస్క్‌ల మధ్య నడుస్తున్న వాదనల నేపథ్యంలో స్పేస్ఎక్స్కు చెందిన 'స్టార్‌లింక్' అధికారికంగా స్పందించింది. తమ ప్రవేశాన్ని రిలయన్స్ మరియు ముఖేష్ అంబానీ అడ్డుకుంటున్నారంటూ మస్క్ చేసిన ఆరోపణలను రిలయన్స్ తిప్పికొట్టిన క్రమంలో.. స్టార్‌లింక్ స్పష్టతనిస్తూ తాము పూర్తి ప్రభుత్వ అనుమతులతో దేశీయంగా భారీ నెట్‌వర్క్‌ను నిర్మించినట్లు వెల్లడించింది.
5 ఏళ్లుగా నిబంధనలకు అనుగుణంగానే కసరత్తు:
భారత మార్కెట్ కోసం తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ స్టార్‌లింక్ ఒక ప్రకటన విడుదల చేసింది:
గత ఐదేళ్లకు పైగా భారత నియంత్రణ సంస్థలు , పరిశ్రమ మరియు టెలికాం ఆపరేటర్లతో కలిసి అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్నామని తెలిపింది.
భారతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను పూర్తిగా సురక్షితంగా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు దేశీయంగానే ప్రత్యేక వ్యవస్థలు, గేట్వేలు, మౌలిక వసతులను నిర్మించినట్లు స్పష్టం చేసింది.
ఇవన్నీ భారత ప్రభుత్వం నిర్దేశించిన అవసరమైన అన్ని అనుమతులకు లోబడే చేపట్టినట్లు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా మూలమూలలకూ హైస్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు స్టార్‌లింక్ సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
పోటీకి సిద్ధమన్న రిలయన్స్ – మస్క్ అభినందనలు:
దీనికి ముందు రిలయన్స్ స్పందిస్తూ.. తాము పోటీకి ఎన్నడూ భయపడబోమని, పోటీయే వినియోగదారుడికి మెరుగైన సేవలను అందిస్తుందని పేర్కొంది. దేశంలో స్టార్‌లింక్ సహా ఏ సంస్థయైనా ఇక్కడి చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని, స్వయంగా జియో శాటిలైట్ సేవలూ అనుమతుల కోసం నిబంధనల ప్రకారం వేచిచూస్తున్నాయని స్పష్టం చేసింది. రిలయన్స్ ప్రకటనపై ఎలాన్ మస్క్ సైతం స్పందిస్తూ "మచ్ అప్రిషియేటెడ్" అని రీట్వీట్ చేయడం ఈ వివాదంలో సరికొత్త మలుపుగా నిలిచింది.