ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మిస్ కావడానికి అసలు కారణం అదే.. విద్యాబాలన్ భావోద్వేగం!
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: భారతీయ సంగీత దిగ్గజం, భారతరత్న కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కాల్సిన ప్రతిష్టాత్మక బయోపిక్‌లో నటించే అవకాశం చేజారిపోవడంపై ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరోసారి తన మనసులోని తీవ్ర వేదనను పంచుకున్నారు. దశాబ్ద కాలం క్రితం ప్రముఖ దర్శకుడు రాజీవ్ మేనన్ దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని ఊహించని పరిణామాలు మరియు న్యాయపరమైన అడ్డంధుల కారణంగా ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లు ఆమె వెల్లడించారు.
చిన్నతనం నుంచే తమ ఇంట్లో ప్రతిరోజూ ఉదయం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గలగలలాడే స్వరాన వెలువడే సుప్రభాతంతోనే రోజు ప్రారంభమయ్యేదని, ఆమె సంగీతం అంటే తనకు ప్రాణమని విద్యాబాలన్ గుర్తుచేసుకున్నారు. దర్శకుడు రాజీవ్ మేనన్ ఈ సినిమా కోసం ఎంతో అద్భుతమైన స్క్రిప్ట్‌ను కూడా సిద్ధం చేశారని, అయితే ఆ చిత్రంపై కోర్టు స్టే ఆర్డర్ రావడంతో తాము ముందుకు వెళ్లలేకపోయామని ఆమె తెలిపారు. ఆ అద్భుతమైన పాత్రలో నటించే అవకాశం చేజారిపోవడంతో తాను అప్పట్లో తీవ్రంగా కుంగిపోయానని, ఆ బాధ ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
సినిమా రూపంలో తన కల నెరవేరకపోయినప్పటికీ, ఆ మహానటిపై తనకున్న అంతులేని గౌరవాన్ని చాటుకునేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నట్లు విద్యాబాలన్ తెలిపారు. కాస్ట్యూమ్ డిజైనర్ అను పార్థసారథి సూచన మేరకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ఒక ఫోటోషూట్ నిర్వహించామని, ఆ చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయని పేర్కొన్నారు. ఆ ఫొటోలు చూసిన తర్వాతే ఆశ్చర్యకరంగా తనకు ఏకంగా ఏడు బయోపిక్ ఆఫర్లు వచ్చాయని, అయితే చట్టపరమైన అనుమతులు మరియు హక్కులు పక్కాగా లభిస్తేనే ఆ పాత్రలు చేయడానికి అంగీకరిస్తానని తాను దర్శకనిర్మాతలకు షరతు పెట్టానని ఆమె స్పష్టం చేశారు.
కేవలం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మాత్రమే కాకుండా, బాలీవుడ్ ఐకానిక్ నటి మీనా కుమారి అలాగే భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కథాంశాలతో తెరకెక్కాల్సిన పలు కీలక ప్రాజెక్ట్‌లు కూడా వివిధ కారణాల వల్ల తనకు మిస్ అయ్యాయని విద్యాబాలన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏ పాత్ర ఎప్పుడు పలకరించాలనేది కాలమే నిర్ణయిస్తుందని భావిస్తానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ ఐకానిక్ సంగీత దిగ్గజం బయోపిక్కు సంబంధించి వస్తున్న వార్తలు, నటీనటుల ఎంపికపై సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, విద్యాబాలన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read: శ్రీలీల, జాన్వీ కపూర్ కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్.. నైనితాల్‌లో షూటింగ్ ప్రారంభం!