పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాల్లో అసలేం జరిగింది.. అసలు నిజం బయటపెట్టిన ఫ్యామిలీ డాక్టర్
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఎంతగానో కలచివేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కేవలం 46 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆయన మరణించి ఐేదేండ్లు పూర్తి అవుతున్న తరుణంలో, ఆ విషాదకరమైన రోజున అసలేం జరిగిందనే వివరాలను పునీత్ కుటుంబ వైద్యుడు డాక్టర్ రమణారావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చివరి క్షణాల గురించి పంచుకున్న విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డాక్టర్ రమణారావు తెలిపిన వివరాల ప్రకారం, ఆ దురదృష్టకరమైన రోజున పునీత్ రాజ్‌కుమార్ జిమ్‌లో సాధారణ వ్యాయామానికి భిన్నంగా సుమారు గంటన్నర పాటు తీవ్రమైన కిక్‌బాక్సింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత తీవ్రమైన అలసటతో, ఒళ్లంతా చెమటలు పట్టిన స్థితిలో నేరుగా డాక్టర్ క్లినిక్‌కు వచ్చారు. ఆయన శారీరక స్థితిని గమనించిన వైద్యులు వెంటనే అప్రమత్తమై ఈసీజీ (ECG) పరీక్ష నిర్వహించారు. ఆ రిపోర్టులో గుండెపై తీవ్రమైన ఒత్తిడి (Strain) పడినట్లు స్పష్టంగా తేలిందని, అది సాధారణ గుండెపోటు కాకపోయినా గుండె తీవ్ర ఇబ్బందిలో ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ తెలిపారు.
వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వెంటనే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేసింది. పునీత్ తన సొంత కారులోనే భార్య అశ్విని ఒడిలో తలపెట్టి ఆసుపత్రికి బయలుదేరారని, మార్గమధ్యంలో ఆయన స్పృహలోనే ఉంటూ మాట్లాడారని డాక్టర్ రమణారావు గుర్తుచేసుకున్నారు. అయితే కారు ఆసుపత్రికి చేరుకోవడానికి సరిగ్గా ఒక్క నిమిషం ముందు ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆసుపత్రికి చేరేసరికి ప్రాణం పోయిందని, అత్యవసర వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడుకోలేకపోయామని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
తన సొంత కొడుకును కోల్పోయినంత వేదన కలిగిందని డాక్టర్ రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపించే పునీత్ రాజ్‌కుమార్ ఆనాడు పడిన అతి తీవ్రమైన శారీరక శ్రమ ఆయన ప్రాణాల మీదకు తెచ్చిందని ఈ సంఘటన ద్వారా తెలుస్తోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అల్లంత దూరంలో నిలిచిపోయిన పవర్ స్టార్ తుదిశ్వాస విడకముందు జరిగిన ఈ వాస్తవాలు మరోసారి అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.
Also Read: 'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది