మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు
సెప్టెంబర్‌లో రూ. 14,474 కోట్ల ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ
ముంబై: మధ్యప్రాచ్యంలో రోజురోజుకూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ (ముడిచమురు) ధరల మంట విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచాయి. దీంతో సెప్టెంబర్ 12వ తేదీ నాటికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత స్టాక్ మార్కెట్లలోని ఎక్స్ఛేంజీల ద్వారా రూ. 14,474 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు, సెప్టెంబర్‌లో మాత్రం అమ్మకాల బాట పట్టారు.
అయితే, సెకండరీ మార్కెట్‌లో అమ్మకాలు సాగినప్పటికీ ప్రైమరీ మార్కెట్ (ఐపీఓలు) ద్వారా మాత్రం పెట్టుబడులు పర్వాలేదనిపించాయి. సెప్టెంబర్ 12 నాటికి ప్రైమరీ మార్కెట్‌లో ఎఫ్‌పీఐలు రూ. 1,336 కోట్లు ఇన్వెస్ట్ చేయడంతో, ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ ద్వారా వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడులు రూ. 47,183 కోట్లకు చేరాయి.
మార్కెట్లపై ఒత్తిడి – మద్దతుగా డీఐఐలు
విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు, చమురు ధరకు రెక్కలు రావడం వల్ల నిఫ్టీ-50 సూచీ వరుసగా ఐదో వారం కూడా నష్టాలతో ముగిసింది. చమురు భయాలు ద్రవ్యోల్బణాన్ని పెంచి, వడ్డీ రేట్ల కోత ప్రక్రియను నెమ్మదింపజేస్తాయన్న భయాలు మార్కెట్ వర్గాల్లో కనిపిస్తున్నాయి.
ఈ తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) మార్కెట్‌ను ఆదుకున్నారు. డీఐఐలు ఈ వారంలో రూ. 6,419.46 కోట్ల నికర కొనుగోళ్లు జరిపి, సూచీల పతనాన్ని కొంతవరకు కట్టడి చేశారు. రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా ఘర్షణల సరళి, గ్లోబల్ స్థూల ఆర్థిక పరిస్థితులు మరియు ముడిచమురు ధరల గమనమే భారత మార్కెట్ల దిశను నిర్ణయించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.