భారత్-కెనడా వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
అక్టోబర్ 5 నుంచి తదుపరి విడత చర్చలు
సూర్య బిజినెస్ డెస్క్: భారత్ మరియు కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) ప్రక్రియ వేగవంతమైంది. రెండు దేశాల మధ్య తదుపరి ఐదవ విడత వాణిజ్య చర్చలు అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాబోయే 90 రోజులు భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాలు మరియు వాణిజ్య పురోగతిలో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల సెప్టెంబర్ 18న న్యూఢిల్లీలో ముగిసిన నాలుగో విడత చర్చల అనంతరం, ఈ ఏడాది చివరి నాటికల్లా ఒప్పందాన్ని ఖరారు చేయాలనే బలమైన సంకల్పంతో ఇరుపక్షాలు ముందుకు సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
ఇటీవల కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మనిందర్ సిధు ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయి చర్చలను మరింత వేగవంతం చేయడంపై సమీక్షించారు. భారత్ నుంచి కెనడాకు ప్రధానంగా ఔషధాలు, ఇనుము, ఉక్కు, సముద్రపు ఆహార ఉత్పత్తులు, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలతో పాటు ఐటీ, టెలికాం మరియు వ్యాపార సేవలు భారీగా ఎగుమతి అవుతున్నాయి. అదే సమయంలో కెనడా నుంచి పప్పుధాన్యాలు, రత్నాలు, బొగ్గు, ఎరువులు, కాగితం మరియు ముడి చమురు భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. 2025 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30.4 బిలియన్ డాలర్లకు చేరుకోగా, 2030 నాటికి దీనిని 70 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా ఇరుదేశాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
కెనడా ఒప్పందంతో పాటు ఇతర దేశాలతో సాగుతున్న వాణిజ్య చర్చల పురోగతిని కూడా పీయూష్ గోయల్ ఈ సందర్భంగా వివరించారు. భారత్-యూరోపియన్ యూనియన్ (EU) మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి రాబోయే మూడు నెలల్లో యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు. ఆ ఆమోదం లభించిన ఆరు నుంచి ఏడు నెలల్లో ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే భారత్-చిలీ వాణిజ్య ఒప్పందం చర్చలను సమీక్షించేందుకు భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల చిలీలో పర్యటించారని, రాబోయే కొన్ని నెలల్లోనే ఈ ఒప్పందానికి సంబంధించి సానుకూల వార్త వింటామని పేర్కొన్నారు.