వైసీపీ మేయర్ అభ్యర్థినిగా..కోలగట్ల శ్రావణి నామినేషన్..
విజయనగరం ప్రతినిధి (మేజర్ న్యూస్): విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో శుక్రవారం ఎన్నికల నామినేషన్ పర్వం మొదలైంది. తొలి రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థినిగా మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరబద్రస్వామి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పి సురేష్ బాబు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేశారు. నామినేషన్ అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలే తమ విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లు డిప్యూటీ మేయర్ గా పనిచేసి విజయనగరం అభివృద్ధికి కృషి చేశామని గుర్తు చేశారు. తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దలు బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్సీ సురేష్ బాబుకి తన కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిదంగా తొలిరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున కార్పొరేట్ అభ్యర్థులుగా 30 వ డివిజన్ నుంచి భీమశెట్టి పావని, 39 వ డివిజన్ నుంచి వెన్ను లక్ష్మణ రావు, 16వ డివిజన్ నుంచి ముత్యాల శ్యామల, 23 వ డివిజన్ నుంచి పొదిలాపు భాగ్యలక్ష్మి, 45 వ డివిజన్ నుంచి తగురోతు సంధ్య తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.