ఉత్తమ ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు సన్మానం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు. 2007లో కడియం మండలం మురమండ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ గురువులకు లభించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల నేపథ్యంలో ఒక్కటయ్యారు.
గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న అదే పాఠశాల ఉపాధ్యాయులు సంధ్యారాణి, సుజాతలను పూర్వ విద్యార్థులు కలిసి ఘనంగా సత్కరించారు. శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో ఉపాధ్యాయులను గౌరవించి తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను గౌరవించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో తూలూరి రాజు, కొప్పాక రమణ, బుష్కా రవి, గుంటూరి లక్ష్మణ్, దూది సురేష్, సీతిన శ్రీను, గుత్తుల ప్రసాద్, అడ్డాల దాసు, చెలప వెంకటస్వామి, వారణాసి నాగు, లలిత టేకి, కోమలి తదితరులు పాల్గొన్నారు.