రెవిన్యూ సేవలో జాప్యం చేస్తే చర్యలు తప్పు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
రీసర్వే, పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి
22(ఎ) భూముల అర్జీలను నిబంధనల మేరకు పరిష్కరించాలి
పీజీఆర్ఎస్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
అగ్రిస్టాక్, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌పై ప్రత్యేక దృష్టి
ప్రజలకు అందించాల్సిన రెవెన్యూ సేవలను నిర్దేశిత గడువులోగా అందించాలని, భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ జీ సాయి ప్రసాద్, భూ పరిపాలన కమిషనర్ విజయ లక్ష్మి జిల్లాలో అన్ని జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో రీసర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, 22(ఎ) నిషేధిత భూముల అర్జీలు, పీజీఆర్ఎస్, అగ్రిస్టాక్, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.అనంతరం కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వే శాఖ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో జిల్లాలో రెవెన్యూ అంశాలపై సమీక్షించారు.
రీసర్వే పనులు వేగవంతం చేయాలి.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీసర్వే పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విలేజ్ సర్వేయర్, వీఆర్వో, తహశీల్దార్ లాగిన్లలో పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఫేజ్–5 రీసర్వే గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్, ఖాతాల ఈ–కేవైసీ ప్రక్రియను శతశాతం పూర్తి చేయాలన్నారు. వెబ్‌ల్యాండ్ పోర్టింగ్ పూర్తయిన వెంటనే రికార్డులను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే మొదటి దశలోని 17 పైలట్ గ్రామాలు, రెండో దశలోని 28 గ్రామాల్లో వెబ్‌ల్యాండ్ పోర్టింగ్ ప్రక్రియ నూరు శాతం పూర్తయిందని తెలిపారు. తదుపరి దశల్లోని గ్రామాల్లోనూ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం జాయింట్ కలెక్టర్ లాగిన్, 13వ నోటిఫికేషన్, ఈ–కేవైసీ, వెబ్‌ల్యాండ్ పోర్టింగ్ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పాస్‌పుస్తకాల పంపిణీకి ప్రాధాన్యం
అక్టోబర్ సైకిల్‌లో లక్ష్యంగా నిర్దేశించిన పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణ, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నవంబర్ సైకిల్‌కు ఎంపిక చేసిన గ్రామాల్లో డ్రాఫ్ట్ పాస్‌పుస్తకాల ఈ–కేవైసీ, గుడ్ ఫర్ ప్రింటింగ్ ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ–కేవైసీ పూర్తికాని ఖాతాదారులను గుర్తించి పాస్‌పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
22ఎ అర్జీలకు సత్వర పరిష్కారం
22ఎ నిషేధిత భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిబంధనల మేరకు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జి.ఓ. ఎంఎస్ నెం.444 నిబంధనలకు అనుగుణంగా తహశీల్దార్, ఆర్డీవో స్థాయిలో క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి, ఎస్‌ఎల్‌ఏ గడువు దాటకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
పీజీఆర్ఎస్‌లో నాణ్యతే ముఖ్యం
పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నమోదైన 16,466 అర్జీలలో ఇప్పటివరకు 13,901 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న అర్జీలను గడువులోగా పరిష్కరించడంతో పాటు, ఫిర్యాదుదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలన్నారు.
పొలం బాటలు, భూ ఆక్రమణలు, అసైన్‌మెంట్ భూములు, భూ సరిహద్దులు, హక్కుల రికార్డు తదితర అంశాలపై వచ్చే ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించాలని ఆదేశించారు. పరిష్కరించిన అర్జీలు తిరిగి రీ–ఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
అగ్రిస్టాక్ పెండింగ్ శూన్యానికి
పీఎం–కిసాన్ లబ్ధిదారులకు సంబంధించి అగ్రిస్టాక్ డిజిటల్ ఫార్మర్ ఐడీల నమోదు, వీఆర్వో ధ్రువీకరణ, తహశీల్దార్ లాగిన్ అప్రూవల్‌లో ఉన్న పెండింగ్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీఆర్వో, ఎంఆర్వో లాగిన్లలో పెండింగ్ కేసులను తక్షణమే క్లియర్ చేసి పెండింగ్‌ను శూన్య స్థాయికి తీసుకురావాలని సూచించారు.
రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్
రెవెన్యూ వన్ కార్యక్రమంలో భాగంగా మాన్యువల్ అడంగల్స్, 1బి, 10–1 రిజిస్టర్ల స్కానింగ్, డాక్యుమెంట్ ఎక్స్‌ట్రాక్షన్, అప్రూవల్ ప్రక్రియలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిజిటలైజ్ చేసిన రికార్డుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని 276 గ్రామాల్లో రెవెన్యూ వన్ ఫేజ్–2 ఇన్వెంటరీ అప్‌డేషన్, తహశీల్దార్ ఆమోదం పూర్తయిన నేపథ్యంలో మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
పేదలకు ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టి
అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల జారీకి అవసరమైన భూసేకరణ, లేఅవుట్ల ప్రణాళికలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆవాస్ ప్లస్ సర్వేలో ఇళ్ల స్థలం లేని అర్హులను గుర్తించి వారికి తగిన కేటాయింపులు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రజల సంతృప్తే ప్రామాణికం
రెవెన్యూ సేవలపై ప్రజల సంతృప్తి శాతాన్ని మరింత పెంచాలని కలెక్టర్ అన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రజా స్పందనను పరిగణనలోకి తీసుకుని సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. రీసర్వే, ఎఫ్–లైన్ సర్వేలు, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు.
పండుగల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
దసరా, దీపావళి తదితర పండుగల నేపథ్యంలో శాంతిభద్రతలు, భద్రతా ప్రమాణాలు, ముందస్తు జాగ్రత్తలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. 6వ జాతీయ చీఫ్ సెక్రటరీల కాన్ఫరెన్స్ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులు అక్టోబర్ 15లోగా పోర్టల్ ద్వారా సూచనలు, ఫీడ్‌బ్యాక్ నమోదు చేయాలని ఆదేశించారు.
ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల స్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి వి సుబ్బారావు అమలాపురం కొత్తపేట ఆర్డీవోలు ఎం సరళ దేవి జీవివి సత్యనారాయణ సర్వే శాఖ ఏడీ కే ప్రభాకర్ తహశీల్దార్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు