మంత్రి ఆనం అలుపెరుగని శ్రమకు గుర్తింపుగా స్థానిక ఎన్నికల్లో కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర కార్యదర్శి మరియు ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు శనివారపు మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి శ్రమను ప్రజలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గ కూటమి ముఖ్య నేతల సమావేశంలో శనివారపు మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై స్పష్టమైన విజన్తో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ఆయన చూపిస్తున్న సేవాతత్పరత, నాయకత్వ పటిమ, మరియు అలుపెరుగని శ్రమకు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు తమ ఓటు రూపంలో రుణం తీర్చుకునే గొప్ప అవకాశం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా లభించిందని తెలిపారు.నియోజకవర్గంలో కూటమి జెండాను రెపరెపలాడించడమే పరమావధిగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఇన్ఛార్జీలు, నాయకులు, మరియు బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ విభేదాలను పక్కనపెట్టి ఒకే తాటిపైకి రావాలని రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కోరారు. రాత్రింబవళ్లు కష్టపడి కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని, అందిస్తున్న సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఆత్మకూరు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే రానున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని, అందరూ మనస్ఫూర్తిగా తరలివచ్చి ఓటు వేయాలని శనివారపు మోహన్ రెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.