ఎల్.కోట మాజీ సర్పంచ్ సంగం నాగమణి వైసీపీలో చేరిక
లక్కవరపుకోట, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ లక్కవరపుకోట మండలంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎల్.కోట మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సంగం నాగమణి, ఆమె భర్త సంగం గోవిందతో పాటు 150కి పైగా కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో గురువారం ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, సోషల్ మీడియా అధ్యక్షుడు యడ్ల కిషోర్, మాజీ సర్పంచులు జామి అప్పలరాజు, ఏడువాక రాజా కిషోర్, కొట్యాడ మహేష్, తూర్పాటి సోంబాబు, తూర్పాటి శివాజీ, మండల యూత్ అధ్యక్షుడు తూర్పాటి అప్పలరాజు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
టీడీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బ?
ఎల్.కోట మేజర్ పంచాయతీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పరిచయాలు, ప్రజల్లో గుర్తింపు ఉన్న సంగం గోవింద వైసీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సొంత నియోజకవర్గంలోని ఎల్.కోట మేజర్ పంచాయతీలో ఈ పరిణామం టీడీపీకి కొంత రాజకీయ నష్టం కలిగించే అవకాశముందని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీని ప్రభావం ఎల్ కోట మండలంలోని ఇతర స్థానాలపైనా పడవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
గ్రామాభివృద్ధి అంశాలే పార్టీ మార్పునకు కారణమా?
ఎన్నో ఏళ్లుగా టీడీపీతో అనుబంధం కొనసాగించిన సంగం గోవింద పార్టీని వీడటానికి గ్రామాభివృద్ధికి ఆటంకాలు సృష్టించే కొందరు వైసీపీ నుంచి టీడీపీ లోకి చేరడం ముఖ్య కారణం అలాగే టీడీపీ అధికారము లోకి వచ్చి చేసింది ఏమి లేదనే అసంతృప్తి ప్రధాన కారణమని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎల్.కోటలో చోటుచేసుకున్న ఈ రాజకీయ పరిణామం రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ చేరికల ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.
రిపోర్టర్ : గోవింద్, ఎల్ కోట, విజయనగరం జిల్లా.