andhrapradesh
దాతల సహకారంతో పార్క్‌ను సుందరీకరించాలి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
అవనిగడ్డ, అక్టోబర్ 10 మేజర్ న్యూస్: నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన అవనిగడ్డలోని తంగిరాల వీరరాఘవయ్య పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పార్కు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవనిగడ్డలోని పార్కు కళావిహీనంగా ఉండటం విచారకరమన్నారు. పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన తర్వాత పార్కు అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పంచాయతీ నిధులతో బాలలకు ఆట పరికరాలు, పెద్దలకు వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక విద్యుత్ దీపాలు, నిఘా కెమెరాలు, నడక మార్గం నిర్మిస్తున్నట్లు వివరించారు.
పార్కులో ఆకర్షణీయమైన మొక్కలు, పచ్చిక బయలు ఏర్పాటు చేసి సుందరీకరించేందుకు గ్రామ పెద్దలు, దాతలు, విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. అవనిగడ్డ రెడ్‌క్రాస్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. పీ-4 స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో పార్కును అభివృద్ధి చేసి, గ్రామస్థులు ఆహ్లాదంగా గడిపేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో యువనాయకుడు మండలి వెంకట్రామ్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, పంచాయతీ ఈఓ తోట శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.