బీసీల రిజర్వేషన్ల జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం, అక్టోబరు 1మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా తప్పుపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065లను హైకోర్టు కొట్టివేయడం ద్వారా ప్రభుత్వ డ్రామాలు బట్టబయలయ్యాయని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చినప్పటికీ, వాటికి విరుద్ధంగా చట్టబద్ధత లేని జీవోలు ఇచ్చి బీసీలను చంద్రబాబు తీవ్ర గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రభుత్వం, అందుకు అనుగుణంగా చట్టం చేయకుండా కేవలం నాటకాలాడుతోందని మండిపడ్డారు. డెడికేషన్ కమిషన్ నివేదిక పూర్తిగా అందకముందే జీవోలు జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. కేంద్రంలో భాగస్వామ్య అధికారంలో ఉండి కూడా బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధం చేసే చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు జీవోలను కోర్టు కొట్టివేయడంతో మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ మరో నాటకానికి తెరతీస్తున్నారని విమర్శించారు. చట్టపరమైన చిక్కులు వస్తాయని తెలిసి కూడా బీసీలను వంచించేలా ప్రభుత్వం వ్యవహరించిందని ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు.