ఆపమంటే ఆగనంటున్న ఆర్టీసీ బస్సు. స్టాపింగ్ ఉన్న బస్సు నిలపకపోవడంతో రచ్చు మర్రి పల్లె గ్రామస్తులు ఆగ్రహం
పులివెందుల మేజర్ న్యూస్:
పులివెందుల మండల పరిధిలోని రచ్చుమారిపల్లె గ్రామ సమీపంలో స్టాపింగ్ ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు నిలపకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలో బస్సు ఆపాలని కోరినా డ్రైవర్ బస్సు నిలపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వాపోతున్నారు.
బస్సు నిలపాలని కోరిన గ్రామస్తులతో మహిళా కండక్టర్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “మా ఇష్టం.. నిలపాలనుకుంటే నిలుపుతాం, లేదంటే లేదు” అంటూ మాట్లాడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.
ముఖ్యంగా ప్రొద్దుటూరు డిపోకు చెందిన బస్సుల విషయంలోనే తరచూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్టాపింగ్ ఉన్న చోట బస్సులు నిలపకపోవడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, రచ్చుమారిపల్లె వద్ద స్టాపింగ్ ఉన్న బస్సులన్నీ తప్పనిసరిగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.