|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 03:15 PM
శంషాబాద్ మండలంలో అక్రమ గర్భస్రావం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. ఓ హోంగార్డు తన ప్రియురాలికి గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించగా, వైద్యం వికటించి ఆమె మృతిచెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళితే... శంషాబాద్ పోలీస్ క్లూస్ టీంలో హోంగార్డుగా పనిచేస్తున్న మధుసూదన్, షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. విషయం బయటకు రాకుండా గర్భస్రావం చేయించాలని మధుసూదన్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పాలమాకుల గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యురాలు పద్మజను సంప్రదించాడు. ఆమె అబార్షన్ చేసేందుకు అంగీకరించింది.అయితే, పద్మజ గర్భస్రావం చేస్తున్న సమయంలో వైద్యం వికటించడంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆందోళనకు గురైన వారు, మెరుగైన చికిత్స కోసం ఆమెను నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, మార్గమధ్యంలోనే యువతి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆర్‌ఎంపీ పద్మజ పరారీలో ఉందని, ఆమెపై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.