రాతి కడీలు ధ్వంసం-ఇద్దరిపై కేసు
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని యన్మన్‌గండ్ల గ్రామ శివారులో ఓ రైతు పొలంలో ఏర్పాటు చేసిన రాతి కడీలను ధ్వంసం చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది.ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..కొండాపూర్ గ్రామానికి చెందిన దొరమోని శ్రీశైలం (38)కు యన్మన్‌గండ్ల శివారులోని సర్వే నంబర్ 179/ఆలో 22గుంటలు,సర్వే నంబర్ 180/1లో 16గుంటలు కలిపి మొత్తం 38గుంటల వ్యవసాయ భూమి ఉంది.ఈ పొలం చుట్టూ శ్రీశైలం రాతి కడీలను ఏర్పాటు చేశారు.ఈ నెల 10వ తేదీన పక్క పొలానికి చెందిన మరికంటి యాదయ్య,శేఖర్ అక్రమంగా పొలంలోకి ప్రవేశించి రాతి కడీలను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయం తెలుసుకున్న శ్రీశైలం ఈ నెల 17వ తేదీన వారిని ప్రశ్నించగా,తనను దుర్భాషలాడినట్లు తెలిపాడు.ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని అనుకున్నప్పటికీ పరిష్కారం కాకపోవడంతో గురువారం శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.