telangana
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం:
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి:నిర్మల్: పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి సేవలు పోలీస్ శాఖకు, భావితరాలకు ఆదర్శమని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బుధవారం నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో సైనికులు రక్షణ కల్పిస్తే, రాష్ట్రంలో అంతర్గత భద్రతను కాపాడుతూ ప్రజలకు భరోసా కల్పించేది పోలీసులేనన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో చైనా సైనికులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల స్మారకంగా ఈ సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం, వారి సమస్యలను పరిష్కరించడం పోలీస్ శాఖ బాధ్యతని పేర్కొన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చి జ్ఞాపికలు అందజేశారు. అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి అమరులైన పోలీసుల పేర్లతో కూడిన రోల్ ఆఫ్ హానర్‌ను చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.