ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత నరసింహ
ఆమనగల్లు రంగారెడ్డి:
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునేఅవకాశమున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం మండల పరిధిలోని రాంనుంతల రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి వ్యవసాయ రంగ పరిస్థితులు, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తక్కువ కాలపరిమితి కలిగిన పంటలతో పాటు కంది, పెసర, జొన్న వంటి తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూసార పరిరక్షణ, నేల ఆరోగ్యం, పంటల సంరక్షణ, నీటి పొదుపు పద్ధతులపై ‘ఖేత్ బచావో అభియాన్’ ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పత్తి కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, తేమ శాతం నియంత్రిస్తూ మలినాలు లేని నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ యాట గీత నరసింహ మాట్లాడుతూ, రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో పంటల సాగు చేపట్టాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంట నష్టాలను తగ్గించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓలు మీనాక్షి, నికిత, వినోద్, రైతులు, దేవర శెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.