ప్రైవేట్ హాస్టళ్ల నిర్లక్ష్యం విద్యార్థిని బలి…
అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న యువతులు
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
తిమ్మాపూర్ మండల పరిధిలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థిని దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం పరారవ్వగా, ఈ ఘటన స్థానిక ప్రైవేట్ హాస్టళ్ల నిర్లక్ష్యాన్ని, పర్యవేక్షణా లోపాన్ని ఎత్తిచూపుతోంది.సిరిసిల్లకు చెందిన మహేందర్ కుమార్తె శ్రీ విద్య (17) తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల సమీపంలోని "ఎస్‌ఆర్ రెడ్డి" ప్రైవేట్ హాస్టల్‌లో నివాసముంటోంది. బుధవారం ఆరోగ్యం బాగుండకపోవడంతో శ్రీ విద్య కళాశాలకు వెళ్లలేదు. రాత్రి 11 గంటల తర్వాత తన స్నేహితురాలు భావన, మరో ఇద్దరితో కలిసి హాస్టల్ నుంచి బయటకు వచ్చింది.రాత్రి 11.40 గంటల సమయంలో వీరంతా మహాత్మానగర్ రహదారి దాటుతుండగా, కరీంనగర్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టి ఆపకుండా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో శ్రీ విద్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకోగా, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. భావనకు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు విద్యార్థినులు సురక్షితంగా బయటపడ్డారు.ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి పోలీసులను కోరారు. దాంతోపాటు, అర్ధరాత్రి వేళ విద్యార్థినులు బయటకు వచ్చినా పట్టించుకోని హాస్టల్ యాజమాన్యం పర్యవేక్షణ లోపంపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్టళ్లు
ఈ ప్రమాద ఘటనతో ప్రైవేట్ హాస్టళ్ల నిర్వహణ తీరుపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు లేకుండా వెలుస్తున్న ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థులకు భద్రత కరువైంది. అర్ధరాత్రి దాటినా విద్యార్థులు గోడలు దూకి బయటకు వస్తున్నా వార్డెన్లు గానీ, యాజమాన్యం గానీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టళ్ల సమీపంలోని హోటళ్లు, బేకరీలు తెల్లవార్లూ నడుస్తుండటంతో విద్యార్థులు రోడ్లపైకి చేరుతున్నారు.సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సుభాష్ నగర్ చౌరస్తా నుండి మహాత్మా నగర్ తపాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు, అలాగే డ్యామ్ కట్ట పైన హాస్టల్ విద్యార్థులు హల్చల్ చేస్తున్నా పోలీసులు, హాస్టల్ నిర్వాహకులు కనీస చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ హాస్టళ్లపై, రాత్రివేళల్లో యథేచ్ఛగా నడిచే వ్యాపార సముదాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.